చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’: కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్, డిసెంబర్ 06: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడానికి ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో నాకాబందీ నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదిక ద్వారా వెల్లడించారు.
రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది ఏకకాలంలో తనిఖీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. నగరంలోని 150 కీలక ప్రాంతాల్లో ముమ్మరంగా నాకాబందీ కొనసాగుతున్నట్టు చెప్పారు.
ఈ డ్రైవ్‌లో శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఆర్మ్డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పేట్రోలింగ్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి. నగర భద్రత, నేర నియంత్రణ, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్టు కమిషనర్ వివరించారు.
పౌరులందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించిన వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

Post a Comment