హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం కలకలం రేపిన ఉపాధ్యాయుల హత్య కేసు
అచ్చంపేట: గత నెల నవంబర్ 24న అచ్చంపేటలో చోటుచేసుకున్న నేనావత్ లక్ష్మణ్ మృతి ఘటన తొలుత అనుమానాస్పద మరణంగా నమోదైనా, పోలీసుల లోతైన దర్యాప్తుతో అది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యగా తేలడం పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
లక్ష్మణ్ భార్య నేనావత్ పద్మ (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు)తో పాటు, అచ్చంపేటలోనే నివసిస్తూ ఆమెతో ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాత్లావత్ గోపి కలిసి ఈ హత్యకు పాల్పడ్డారని సూచించే ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో అచ్చంపేట సీఐ నాగరాజు, ఎస్సై సద్దాం ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అనుమానాలు బలపడటానికి కారణాలు
లక్ష్మణ్ మృతిలో ఉన్న అనేక అనుమానాస్పద అంశాలు పోలీసుల దృష్టిని ఆకర్షించాయి. మృతదేహంపై ఉన్న గాయాల స్వభావం, సంఘటనా స్థల పరిస్థితులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల్లో కనిపించిన తేడాలు దర్యాప్తుకు కీలకంగా మారాయి. ఇవన్నీ కలిసి ఇది సహజ మరణం కాదన్న అనుమానాలను బలపరిచినట్లు పోలీసులు తెలిపారు.
అక్రమ సంబంధమే హత్యకు కారణం
పోలీసుల దర్యాప్తులో పద్మ, గోపిల మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. అదే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనకు ముందు జరిగిన ఫోన్ కాల్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇది ముందుగా పథకం వేసి చేసిన హత్యగా నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు.
పట్టణంలో తీవ్ర చర్చ
ప్రభుత్వ ఉపాధ్యాయుడు హత్య కేసులో నిందితుడిగా అరెస్టు కావడం అచ్చంపేటలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో మరెవరైనా పాత్రధారులు ఉన్నారా?, సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నాలు జరిగాయా?, హత్య అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటన్న అంశాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Post a Comment