-->

ఒకే గ్రామంలో ఇద్దరికి గెలుపు ధ్రువీకరణ పత్రాలు – అధికారుల నిర్లక్ష్యం?

సర్పంచ్ ప్రమాణస్వీకారంలో విచిత్ర పరిస్థితి ఒకే గ్రామంలో ఇద్దరికి గెలుపు ధ్రువీకరణ పత్రాలు – అధికారుల నిర్లక్ష్యం?


మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, దామరవంచ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల విషయంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారింది.

గ్రామ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు వేర్వేరు సమయాల్లో విజయం సాధించినట్లు ప్రకటిస్తూ అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేయడం సంచలనంగా మారింది.

ఎన్నికల అనంతరం మొదటగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన స్వాతి 3 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించిన అధికారులు ఆమెకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. దీంతో స్వాతి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభించి, బంధువులు, పార్టీ నాయకులను ఆహ్వానించారు.

అయితే, ఇదే ఘటనలో అరగంట తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన సుజాతను ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు మరోసారి ప్రకటిస్తూ, అదే రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఆమెకూ గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. దీంతో సుజాత కూడా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసుకొని, బంధువులను ఆహ్వానించడం ప్రారంభించారు.

ఒకే గ్రామంలో, ఒకే పదవికి ఇద్దరికి గెలుపు సర్టిఫికెట్లు జారీ కావడంపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమా? లేక లెక్కింపులో పెద్ద పొరపాటా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ ఘటనతో దామరవంచ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు, రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793