500 రూపాయల నకిలీ నోట్ల కలకలం.. బ్యాంకులో పట్టుబడిన రూ.2.08 లక్షలు
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో నకిలీ నోట్ల కలకలం తీవ్ర కలకలం రేపింది. స్థానిక కెనరా బ్యాంక్‌లో పంట రుణం చెల్లించేందుకు తీసుకువచ్చిన నగదు మొత్తం నకిలీ నోట్లుగా తేలడంతో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో రైతు పరారీలోకి వెళ్లగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామానికి చెందిన నరెడ్ల చిన్న సాయిలు గతంలో కెనరా బ్యాంక్‌లో పంట రుణం తీసుకున్నాడు. ఆ రుణాన్ని చెల్లించేందుకు గురువారం మధ్యాహ్నం బ్యాంక్‌కు వచ్చాడు. కౌంటర్‌లో రూ.2,08,500 నగదును బ్యాంకు సిబ్బందికి అందజేశాడు. నగదును లెక్కిస్తున్న సమయంలో అన్ని నోట్లు రూ.500 నకిలీ నోట్లుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు.
దీంతో వెంటనే ఈ విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియజేశారు. అనంతరం రైతును నగదు ఎక్కడి నుంచి తెచ్చావని ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా చిన్న సాయిలు బ్యాంక్ నుంచి పారిపోయాడు. దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో, ఇటీవల ఈ రైతు తన ధాన్యాన్ని మిల్లర్లకు బ్రోకర్ ద్వారా విక్రయించినట్లు సమాచారం లభించింది. ఆ సమయంలో మిల్లర్లు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నరెడ్ల చిన్న సాయిలు తన సోదరి ఇచ్చిన నగదును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లానని కొంతమందికి చెప్పినట్లు సమాచారం.
ఈ నకిలీ నోట్లను ఒకే వ్యక్తి ఇచ్చాడా? లేక వేర్వేరు ప్రాంతాల నుంచి సేకరించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నకిలీ నోట్ల మూలాలు, వాటి సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు, ముఠాలపై పూర్తి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం రైతు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో వర్ని మండలంలో నకిలీ నోట్లపై భయాందోళనలు నెలకొన్నాయి. బ్యాంకు లావాదేవీల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

Post a Comment