రామగుండంలో 40 రోజుల నమాజ్ చేసిన విద్యార్థులకు సైకిల్ బహుమతులు
రామగుండం: రామగుండం పట్టణంలోని మసీదు ఒమర్ ఫరూఖ్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, క్రమశిక్షణను పెంపొందించేందుకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 40 రోజుల పాటు నిరంతరంగా నమాజ్‌ను క్రమబద్ధంగా కొనసాగించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
మసీదు ఒమర్ ఫరూఖ్ కమిటీ అధ్యక్షుడు జావిద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, నమాజ్‌ను క్రమశిక్షణతో కొనసాగించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకంగా సైకిళ్లను బహుమతులుగా అందజేశారు. ఈ సైకిల్ బహుమతులను జేఐహెచ్ (JIH) అధ్యక్షుడు సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సేనీ విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా రామగుండం మండల ఇంచార్జి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ (వైస్ ప్రెసిడెంట్ – టెమ్రీస్ కౌన్సిలర్) ప్రత్యేక అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయసులోనే నమాజ్‌ను అలవాటు చేసుకోవడం ద్వారా నైతిక విలువలు, క్రమశిక్షణ, మంచి ప్రవర్తన అలవడుతాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజ భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
శుక్రవారం నమాజ్ అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో మౌలానాలు, మసీదు కమిటీ సభ్యులు, పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన మసీదు ఒమర్ ఫరూఖ్ కమిటీని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమం విద్యార్థులకు ఆధ్యాత్మిక ప్రోత్సాహంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా నిలిచిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.


Post a Comment