రెండు చెక్కు బౌన్స్ కేసుల్లో ఇద్దరికీ జైలు శిక్ష మరియు జరిమానా రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పు
కొత్తగూడెం లీగల్ న్యూస్: కొత్తగూడెం పట్టణంలో నమోదైన రెండు వేర్వేరు చెక్కు బౌన్స్ కేసుల్లో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.రవికుమార్ శుక్రవారం తీర్పు వెలువరించారు.
కేసు–1 వివరాలు:
కొత్తగూడెం టౌన్ మేదర బస్తీకి చెందిన బ్రిజిలాల్ అగర్వాల్ మహాలక్ష్మి ట్రిప్టు అండ్ క్రెడిట్ మ్యూచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని నిర్వహిస్తున్నారు. ఈ సొసైటీ నుంచి మధుర బస్తీకి చెందిన జంగం సత్యనారాయణ 2013 డిసెంబర్ 16న రూ.1,24,000 రుణంగా తీసుకుని ప్రామిసరీ నోటు, గ్యారెంటీ అగ్రిమెంట్ ఇచ్చాడు. నెలకు రూ.5,000 చొప్పున చెల్లిస్తానని హామీ ఇచ్చినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో ఫిర్యాదుదారు డిమాండ్ చేయగా, 2017 అక్టోబర్ 10న రూ.1,17,330 విలువైన చెక్కును అందించాడు.
ఆ చెక్కును 2017 అక్టోబర్ 17న బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయ్యింది. లీగల్ నోటీస్ ఇచ్చినా కూడా చెల్లింపు జరగకపోవడంతో కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. సాక్ష్యాల పరిశీలన అనంతరం నేరం రుజువైనందున జంగం సత్యనారాయణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధించడంతో పాటు ఫిర్యాదుదారునికి రూ.1,95,000 నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కేసు–2 వివరాలు:
ఇదే ఫిర్యాదుదారైన బ్రిజిలాల్ అగర్వాల్ వద్ద మేదర బస్తీకి చెందిన జీడి కుమార్ 2013 డిసెంబర్ 16న రూ.1,24,000 నగదు తీసుకుని ప్రామిసరీ నోటు, గ్యారెంటీ అగ్రిమెంట్లు ఇచ్చాడు. నెలకు రూ.5,000 చొప్పున చెల్లించకపోవడంతో డిమాండ్ చేయగా, 2015 అక్టోబర్ 10న రూ.1,11,930 విలువైన చెక్కును ఇచ్చాడు.
ఆ చెక్కును గణేష్ బస్తీ ఎస్‌బీఐ బ్యాంకులో జమ చేయగా అది కూడా బౌన్స్ అయ్యింది. లీగల్ నోటీస్ ఇచ్చినా స్పందన లేకపోవడంతో కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. విచారణ అనంతరం నేరం రుజువైన జీడి కుమార్‌కు కూడా ఆరు నెలల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధించడంతో పాటు రూ.1,95,000 నష్టపరిహారం ఫిర్యాదుదారునికి చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు.
ఈ రెండు తీర్పులు చెక్కు బౌన్స్ కేసుల్లో చట్టపరమైన బాధ్యతలను గుర్తు చేస్తాయని న్యాయ నిపుణులు పేర్కొన్నారు.

Post a Comment