-->

ప్రేమ పెళ్లిగా మొదలైన జీవితం.. తొమ్మిది నెలలకే విషాదాంతం కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త

ప్రేమ పెళ్లిగా మొదలైన జీవితం.. తొమ్మిది నెలలకే విషాదాంతం కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త


హైదరాబాద్, డిసెంబర్ 19 : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కట్న దాహం మరో అమాయక ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కట్నం కోసం భార్యను హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రాంతానికి చెందిన అనూష (20), పరమేష్ పరస్పరం ప్రేమించుకుని ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది మార్చి 12న వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే వారి వైవాహిక జీవితంలో చిచ్చు మొదలైంది. పెళ్లయిన మూడు నెలల నుంచే అదనపు కట్నం తీసుకురావాలని భర్త పరమేష్ అనూషను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మరోసారి కట్నం విషయమై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన పరమేష్, ఇంట్లో ఉన్న కర్రతో అనూషను విచక్షణారహితంగా కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాల పాలైన అనూష అపస్మారక స్థితికి చేరింది.

కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రేమ పెళ్లిగా ప్రారంభమైన జీవితం కట్న దాహంతో ముగియడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్నం అనే సామాజిక దుష్టచర్య కారణంగా యువతులు ప్రాణాలు కోల్పోతుండటంపై మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793