-->

మేం రివర్స్‌లోనే పూజిస్తాం.. దయచేసి వివాదం చేయొద్దు: మంత్రి సీతక్క విజ్ఞప్తి

మేం రివర్స్‌లోనే పూజిస్తాం.. దయచేసి వివాదం చేయొద్దు: మంత్రి సీతక్క విజ్ఞప్తి


స్వస్తిక్‌ గుర్తు (Swastika Symbol)ను విశ్వానికి ప్రతీకగా పరిగణిస్తారనే విషయం తెలిసిందే. హిందూ పురాణాల ప్రకారం స్వస్తిక్‌కు మతపరంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది. ‘స్వస్తిక్’ అనే పదానికి శుభప్రదమైనది అనే అర్థం ఉంది. ఏదైనా శుభకార్యానికి ముందు స్వస్తిక్ గుర్తును రూపొందించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని గణేశుడి రూపంగా కూడా భావిస్తారు.

స్వస్తిక్‌ గుర్తు ద్వారా శ్రేయస్సు, సమృద్ధి, ఏకాగ్రత లభిస్తాయని విశ్వాసం. అయితే, మేడారం ఆలయ నిర్మాణంలో భాగంగా స్వస్తిక్ గుర్తును రివర్స్‌ (తలక్రిందులుగా) ఏర్పాటు చేయడం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సీతక్క స్పందించి స్పష్టమైన వివరణ ఇచ్చారు.

స్వస్తిక్ గుర్తు విషయంలో ఎలాంటి అనవసర వివాదాలు చేయవద్దని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. “మా గిరిజన సంప్రదాయంలో రివర్స్‌లో ఉన్న స్వస్తిక్ గుర్తునే పూజిస్తాం. ఇది కొత్తది కాదు. శతాబ్దాలుగా మా ఆచారాల్లో భాగంగా కొనసాగుతోంది. అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి” అని ఆమె పేర్కొన్నారు.

గిరిజన సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, మేడారం ఆలయ నిర్మాణంలో ఆ సంప్రదాయాలకే ప్రాధాన్యం ఇచ్చామని సీతక్క స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది నిర్వహించనున్న మేడారం మహాజాతర నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మంగళవారం మేడారం జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు.

తొలుత వనదేవతలు సమ్మక్క – సారలమ్మలను దర్శించుకున్న మంత్రులు, అనంతరం జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహాజాతరకు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఏర్పాట్లను వేగవంతం చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు వారు సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793