ఇద్దరు ప్రియుళ్లతో రహస్య సంబంధాలు
జనవరి 13: ఇద్దరు ప్రియుళ్లతో సాగించిన చాటుమాటు సరసాలే ఓ వివాహిత జీవితాన్ని విషాదాంతానికి చేర్చాయి. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ అక్రమ సంబంధాల్లో చిక్కుకున్న ఆమె, చివరకు ప్రియుడి చేతిలో దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
గతంలో బంజారాహిల్స్‌లోని పబ్‌లో పనిచేసిన ఫాతిమా, తరువాత పంజాగుట్ట ఊర్వశి పబ్‌లో ఉద్యోగం చేపట్టింది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం బోరబండ అల్లాపూర్‌కు చెందిన ఎం.డి. జహీరుద్దీన్ (31)తో పరిచయం ఏర్పడింది. అతనికీ వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ, ఫాతిమాతో అక్రమ సంబంధం కొనసాగించాడు.
ప్రతిరోజూ సాయంత్రం ఆమెను బైక్‌పై పబ్‌కు తీసుకెళ్లడం, రాత్రి డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటి వద్ద దింపడం జహీరుద్దీన్ దినచర్యగా మారింది. అయితే ఫాతిమా వ్యవహారంపై అనుమానం వచ్చిన అతడు, ఆమెకు తెలియకుండా వాట్సాప్‌ను స్కాన్ చేసి తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. దీంతో ఆమె చాటింగ్‌లు, సందేశాలు గమనించసాగాడు.
ఆదివారం తనకు ఇతర పని ఉందని చెప్పిన ఫాతిమా, బోయిన్‌పల్లిలోని మరో ప్రియుడి ఇంటికి వెళ్లిన విషయం వాట్సాప్ ద్వారా తెలిసిన జహీరుద్దీన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అదే రోజు రాత్రి 11.30 గంటలకు ఊర్వశి పబ్ వద్దకు వెళ్లి ఆమెను బైక్‌పై ఎక్కించుకుని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ మేల్ వార్డు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అక్కడ ఆమెను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆవేశానికి గురైన జహీరుద్దీన్, తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. నేలపై పడిన ఫాతిమా తలపై గ్రానైట్ రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు.
హత్య అనంతరం ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు విషయం చెప్పిన జహీరుద్దీన్, అనంతరం బోరబండ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఫాతిమా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతురాలి భర్త నవాబ్ మసూద్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment