మేడారం మహాజాతరలో సజావుగా వనదేవతల దర్శనం
మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా వనదేవతలను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు క్యూలైన్లలో క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది.
మహాజాతర సందర్భంగా మూడు వైపులా ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నారు. ఈసారి గద్దెలను విస్తరించిన నేపథ్యంలో, గత జాతరలతో పోలిస్తే తక్కువ సమయంలోనే సమ్మక్క–సారలమ్మల దర్శనం పూర్తవుతుండటంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భారీగా భక్తులు తరలివస్తున్నప్పటికీ ఎక్కడా తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్ల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, భక్తులను సక్రమంగా ముందుకు తరలిస్తున్నారు. అలాగే వాలంటీర్లు సైతం భక్తులకు మార్గనిర్దేశం చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఈసారి ప్రత్యేకంగా క్యూలైన్ల వెంట తాగునీటి వసతి కల్పించడంతో భక్తులు ఉపశమనం పొందుతున్నారు. వయోవృద్ధులు, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
క్రమపద్ధతిలో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పోలీస్ యంత్రాంగం సమన్వయం, వాలంటీర్ల సేవల కారణంగా వనదేవతల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని భక్తులు తెలిపారు. మొత్తం మీద ఈసారి మేడారం మహాజాతరలో అమ్మవార్ల దర్శనం మరింత సులభంగా, సురక్షితంగా కొనసాగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment