సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు అధికారులతో సమానంగా సౌకర్యాలు, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రత్యేకంగా ఐఫోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే దేశంలోనే ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. కాంట్రాక్టు కార్మికులకూ ప్రభుత్వం పెద్దపీట వేసి రూ.40 లక్షల ప్రమాద బీమా కల్పిస్తోంది.
కార్మికుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం, సింగరేణి ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అదే విధంగా కారుణ్య నియామకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
లాభాల్లో కార్మికుల వాటాను కూడా పెంచిన రేవంత్ ప్రభుత్వం, గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వాటాతో రూ.802 కోట్లను కార్మికులకు చెల్లించింది. ఇది దేశంలోనే ఒక చరిత్రాత్మక నిర్ణయమని కార్మిక సంఘాలు ప్రశంసిస్తున్నాయి.
సింగరేణి కార్మికుల భద్రత, సంక్షేమం, భవిష్యత్తే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ నిర్ణయాలు అందుకు నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

Post a Comment