-->

బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చింది? : కవిత ప్రశ్న

బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చింది? : కవిత ప్రశ్న


హైదరాబాద్, ఫిబ్రవరి 6 : బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవ్ రెడ్డికి బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి సహా పలు బీసీ సంఘాలు ఎన్నో రోజులుగా పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిన ఫలితంగా బిల్లు వచ్చిందని కవిత గుర్తు చేశారు. అయితే ఆ బిల్లును అడ్డుకునేందుకు మాధవ్ రెడ్డి సహా మరో వ్యక్తి పిటిషన్ వేశారని తెలిపారు.

అలాంటి వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం అంటే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీఆర్ఎస్ పార్టీ రాజముద్ర వేసినట్లేనని ఆమె విమర్శించారు. తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీల నోటికాడి ముద్దును లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

మాధవ్ రెడ్డి హరీష్ రావుకు దగ్గరి వ్యక్తి అని, ఆయన పర్సనల్ లాయర్ ద్వారానే ఈ కేసు వేయించారని అప్పట్లో భావించామని, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల దీని వెనుక మొత్తం పార్టీ ఉన్నట్లు అర్థమవుతోందని కవిత అన్నారు. బీఆర్ఎస్ బీసీల విషయంలో చిత్తశుద్ధితో లేదని ఆరోపించారు.

జనగణన, బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ గందరగోళ వైఖరి ప్రదర్శించిందని, బీసీలంతా రోడ్లపైకి వచ్చిన తర్వాతే మీటింగ్‌లు నిర్వహించారని చెప్పారు. బుట్టంగారి మాధవ్ రెడ్డిని నాయకుడిగా తయారు చేసింది జాగృతేనని, 2010 వరకు ఆయన తమతోనే ఉన్నారని గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీపై కూడా కవిత తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరికేపూడి గాంధీని నిజామాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా నియమించడాన్ని ప్రజల తీర్పుకు అవమానంగా అభివర్ణించారు. స్పీకర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావులను కూడా కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా నియమించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై నిజంగా నమ్మకం ఉంటే అరికేపూడి గాంధీని ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించాలని, స్పీకర్ ఇప్పటికైనా ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఏటా 20 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని హామీ ఇచ్చి, రెండు బడ్జెట్‌లలో కలిపి ఏడువేల కోట్ల నిధులు కూడా కేటాయించలేదని కవిత అన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బీసీ సబ్‌ప్లాన్‌పై గట్టి కసరత్తు చేయాలని సూచించారు.

ఈ నెల 12న హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సభకు ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.

మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరపున సింహం గుర్తుపై పోటీ చేస్తున్నామని, ప్రజల పక్షాన ప్రశ్నించే సీపీఎం, న్యూ డెమక్రసీ, స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని కవిత కోరారు.

తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఒక పుస్తకమని, ఆయన చరిత్రను ఎవరూ చెరిపివేయలేరని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయాల్లో మర్యాదపూర్వకమైన విమర్శలు ఉండాలని, ముఖ్యమంత్రి హద్దులు దాటి చేసిన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని కవిత అన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793