గ్రామ పంచాయతీలకు రూ.21.04 కోట్లు మంజూరు: కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, మార్చి 07: పెద్దపల్లి జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షణలో చేపట్టుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక వసతులు, త్రాగునీటి సదుపాయం, వీధి దీపాల నిర్వహణ వంటి పనుల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం విడుదల చేసిన ప్రకటనలో, పెద్దపల్లి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద మొత్తం రూ.21 కోట్ల 4 లక్షలు విడుదలైనట్లు తెలిపారు. జిల్లాలోని 13 గ్రామీణ మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు 2023–24 మరియు 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ నిధులు 2026 జనవరి 13, ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 26 తేదీలలో మూడు విడతల్లో విడుదలైనట్లు తెలిపారు. మొత్తం నిధుల్లో అన్‌టైడ్ గ్రాంట్ రూ.5 కోట్ల 73 లక్షలు, టైడ్ గ్రాంట్ రూ.15 కోట్ల 31 లక్షలు ఉన్నాయని వివరించారు.
అన్‌టైడ్ గ్రాంట్ నిధులతో గ్రామ పంచాయతీలకు సంబంధించిన కరెంట్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు మరియు ఇతర కార్యాలయ ఖర్చులు చెల్లించవచ్చని తెలిపారు. టైడ్ గ్రాంట్ నిధులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి వినియోగిస్తారని కలెక్టర్ వెల్లడించారు.

Post a Comment