వీకే కోల్ మైన్ బొగ్గు ఉత్పత్తి సింగరేణి కార్మికులతోనే తీయాలి: ఏఐటీయూసీ డిమాండ్
కొత్తగూడెం: వీకే కోల్ మైన్‌లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా సింగరేణి కార్మికులతోనే చేయాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. సత్తుపల్లి ఏరియాకు డిప్యూటేషన్‌పై పంపిన కార్మికులను వెంటనే తిరిగి వీకే కోల్ మైన్‌లో నియమించాలని కోరింది.
కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ సెక్రటరీ మల్లికార్జున్ రావు, కేంద్ర కార్యదర్శి వంగా వెంకట్ సారథ్యంలో నాయకులు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజును కలిసి మెమోరాండం అందించారు. జీకే ఓసీ నుంచి జేవీఆర్ ఓసీకి డిప్యూటేషన్‌పై పంపిన కార్మికులను తిరిగి వీకే సిఎంలో నియమించాలని, కోల్ క్రషర్లు మరియు బొగ్గు రవాణా కార్యకలాపాలను సింగరేణి సిబ్బందితోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే వీకే సిఎంకు తగిన సిబ్బంది, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
కొత్తగూడెం ఏరియాలోని గౌతంఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ మూసివేత తరువాత వివిధ ఏరియాలకు, ముఖ్యంగా సత్తుపల్లి ఏరియాకు డిప్యూటేషన్‌పై పంపిన కార్మికులను తిరిగి వీకే సిఎంలోనే నియమించాలని నాయకులు కోరారు. వీకే సిఎం ప్రైవేటీకరణ జరిగితే కొత్తగూడెం ప్రాంతంలో కార్మికుల సంఖ్య తగ్గిపోతుందని, దాంతో స్థానిక ప్రజలు మరియు వ్యాపారవర్గాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎట్టిపరిస్థితుల్లోనైనా డిప్యూటేషన్‌పై వెళ్లిన కార్మికులను తిరిగి వీకే సిఎంలో నియమించి కొత్తగూడెం ఏరియాను కాపాడాలని బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాములు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు హుమాయిన్, వీకే సిఎం పిట్ సెక్రటరీ ఎంఆర్కె ప్రసాద్, ఏరియా స్టోర్స్ పిట్ సెక్రటరీ కమల్, వర్క్‌షాప్ పిట్ సెక్రటరీ మధుకృష్ణ, రాజేశ్వరరావు, సాంబమూర్తి, బండారి మల్లయ్య, రమణ, సురేష్, సాయి పవన్, రవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment