చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి (కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించి కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక ఎస్సైతో పాటు మొత్తం నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బయట నుంచి స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రి లేదా బాణసంచా వస్తువులను పరిశీలన కోసం స్టేషన్‌లోకి తీసుకువచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఎస్సైతో పాటు పోలీస్ వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ ఆవరణ దద్దరిల్లిపోయింది. స్టేషన్ లోపల ఫర్నిచర్ ధ్వంసమవడంతో పాటు, బయట నిలిపిన వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురై, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే సీఐ కేఎస్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అసలు మందుగుండు సామగ్రిని స్టేషన్‌కు ఎందుకు తీసుకువచ్చారు? పేలుడు ఎలా జరిగింది? అనే కోణాల్లో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో చల్లపల్లి ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

Post a Comment