పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే న్యూసెన్స్.. ఇరువర్గాలపై కేసులు
తూప్రాన్, మార్చి 10: మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ వివాదం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఘర్షణకు దారితీసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించిన ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన మన్నె దుర్గయ్య మూడో కుమార్తెకు చేగుంట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కాశభోయిన ఉదయ్‌కుమార్‌తో వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ వివాదం కొనసాగుతోంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. పరస్పరం దూషణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు పలుమార్లు వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించి గొడవ చేయవద్దని హెచ్చరించినప్పటికీ వారు వినకపోవడంతో స్టేషన్ ప్రాంగణంలోనే న్యూసెన్స్ సృష్టించినట్లు తెలిపారు.
దీంతో ప్రజా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇరువర్గాలపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేసినట్లు తూప్రాన్ పోలీసులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment