హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి కుంభకోణం.. హోటళ్లకు సరఫరా వెలుగులోకి
హైదరాబాద్: నగరంలో కల్తీ నెయ్యి తయారీ వ్యవహారం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. హోటళ్లు, శుభకార్యాలు మరియు ఫంక్షన్లలో వడ్డించే నెయ్యి అసలు నెయ్యి కాదని అధికారులు గుర్తించారు. తక్కువ నాణ్యత గల నూనెలు మరియు ఇతర పదార్థాలు కలిపి నెయ్యి తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఘటన బయటపడింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో మహమ్మద్ జునైద్ హుస్సేన్ అనే వ్యక్తి “ప్రైడ్ డెయిరీ” పేరుతో నెయ్యి తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అధికారిక అనుమతులు ఉన్నప్పటికీ అక్రమంగా కల్తీ నెయ్యి తయారు చేసి నగరంలోని పలు హోటళ్లు, శుభకార్యాలు మరియు ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
స్థానికుల సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించగా, అక్కడ భారీ స్థాయిలో కల్తీ నెయ్యి తయారీ జరుగుతున్నట్లు బయటపడింది. పామ్ నూనె, డాల్డా మరియు ఇతర హానికర పదార్థాలను ఆవు, గేదె మీగడలో కలిపి నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
దాడుల సమయంలో అధికారులు భారీగా ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 460 కిలోల కల్తీ నెయ్యిను పట్టుకున్నారు. అలాగే వేల కిలోల ఆవు మీగడ, గేదె మీగడతో పాటు కల్తీకి ఉపయోగించే నూనెలు మరియు ప్యాకింగ్ సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Post a Comment