అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు ఘన సన్మానం
గోదావరిఖని, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో మహిళా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం మహిళా పోలీస్ అధికారులను, సిబ్బందిని శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ మహిళల్లో సంకల్పశక్తి, కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుందని, వారు ఏ రంగంలోనైనా గొప్ప విజయాలు సాధించగలరని అన్నారు. దేశంలోని అన్ని రంగాల్లో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
మహిళా పోలీస్ అధికారులు తమ పూర్తి శక్తి, సామర్థ్యాలతో విధులు నిర్వహిస్తూ లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ విధులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్, రైటర్, పెట్రోలింగ్, బ్లూ కోట్స్, సైబర్ వారియర్స్ వంటి విభాగాల్లో మహిళా పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు.
అలాగే పాఠశాలలు, కళాశాలల్లో షీ టీమ్స్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ముఖ్యమైన బందోబస్త్ విధుల్లో పాల్గొనడం వంటి బాధ్యతలను మహిళా పోలీస్ అధికారులు సమర్థంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. గృహహింస, వైవాహిక వివాదాల వంటి కేసుల్లో బాధిత మహిళలకు కౌన్సెలింగ్ అందిస్తూ మహిళా పోలీస్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
మహిళలు పలు రంగాల్లో సాధిస్తున్న విజయాలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, మహిళా అధికారులు ధైర్యంగా ఉండి తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని ఏసీపీ సూచించారు. మహిళా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం ఎస్సై సంధ్యారాణి, రామగిరి ఎస్సై దివ్య, వన్ టౌన్ ఎస్సై అనూష తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment