సింగరేణి కొత్తగూడెం ఏరియా పి.వి.కే 5లో ఘనంగా ఈద్ మిలాద్ వేడుకలు
కొత్తగూడెం ఏరియా సింగరేణి 5 ఇంక్లైన్ గ్రూప్ మైన్స్‌లో పి.వి.కే పైలో ఈద్ మిలాద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ షాలేం రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడేనని, మనుషుల మధ్య విభేదాలు మనమే సృష్టించుకున్నవేనని అన్నారు. దేవుడు అందరికీ గాలి, నీరు, ఆహారం సమానంగా ఇస్తున్నాడని, కానీ మనుషులు మాత్రం మతాల పేరుతో విభేదాలు పెంచుకుంటున్నారని తెలిపారు. నిజమైన భక్తి అనేది మానవత్వంలోనే ఉందని, దైవాన్ని నమ్మే వారు ఎప్పుడూ ఇతరులను బాధ పెట్టరని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులు కుల, మతాలకు అతీతంగా కలిసి పనిచేస్తూ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నారని, ఈ భావనపై ప్రతి కార్మికుడు గర్వపడాలని సూచించారు. “నేను మాత్రమే సుఖంగా ఉండాలి” అనే స్వార్థ భావనను విడిచిపెట్టి “మనమంతా బాగుండాలి” అనే సమిష్టి ఆలోచనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే తమకు అన్నం పెట్టే సింగరేణి సంస్థను నిబద్ధతతో కాపాడుకోవాలని అన్నారు.
ముస్లిం మత పెద్ద షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ రంజాన్ పర్వదిన ప్రాముఖ్యతను వివరించారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, పొరుగువారితో సత్సంబంధాలు, మానవతా విలువలు పాటించడం ద్వారానే నిజమైన భక్తి సాధ్యమవుతుందని చెప్పారు.
గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ నీతి, నిజాయితీతో తమ విధులను నిర్వహించడం కూడా భక్తి రూపమేనని తెలిపారు. అన్ని మతాల పండుగలను పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ముస్లిం కార్మికులు అందరికీ తియ్యని షీర్ కుర్మా (సేమీయాలు) పంచి మత సామరస్యాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో గని వెల్ఫేర్ ఆఫీసర్ షకీల్, ఏఐటియుసి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, సిఐటియు బ్రాంచ్ సెక్రటరీ విజయగిరి శ్రీనివాస్, ఇతర యూనియన్ నాయకులు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment