టిప్పర్ లారీ వెనుక వైపు వేగంగా బైక్ ఢీకొని వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, ఏప్రిల్ 22: జన్నారం మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన బిల్లా మహేందర్ (45) రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తూ మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం, మహేందర్ తండ్రి లచ్చన్న. మహేందర్ వృత్తిరీత్యా మార్బుల్ పనులు చేస్తూ మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రోజు పనులు ముగించుకుని మంచిర్యాల నుండి జన్నారం వైపు బైక్‌పై వెళ్తున్న సమయంలో తపాలాపూర్ చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ లారీని గమనించకపోవడంతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో మహేందర్ తీవ్ర గాయాలు పొంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో మందపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతుడికి భార్య, పిల్లలు ఉండగా కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై జి. ఉదయ్ కిరణ్ తెలిపారు.

Post a Comment