ప్రమాదకరంగా మారిన కిన్నెరసాని పైపులైన్ తవ్వకం – అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
కొత్తగూడెం పట్టణంలో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఓ ప్రమాదకర పరిస్థితి స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. భజన మందిర్ నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో, హనుమాన్ గుడి జంక్షన్ వద్ద కిన్నెరసాని పైపులైన్ పగిలి దాదాపు పది రోజులు గడిచినా ఇప్పటికీ మరమ్మత్తులు చేపట్టలేదు.
పైపులైన్ దిద్దుబాట్ల కోసం సుమారు 20 అడుగుల లోతులో తవ్విన గొయ్యి నడిరోడ్డుపై అలాగే వదిలిపెట్టడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేదా భద్రతా చర్యలు లేకపోవడంతో వాహనదారులు గొయ్యిని గమనించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే కొంతమంది గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇంకా ఒకవైపు పైపులైన్ పగిలిపోవడంతో తాగునీటి సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంత పెద్ద ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం పై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు మరింత పెరిగే ముందు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ మరియు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో చర్చించి పైపులైన్ మరమ్మత్తులు పూర్తి చేయాలని హనుమాన్ బస్తి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
“ప్రజల ప్రాణాల కంటే నిర్లక్ష్యం పెద్దదా?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Post a Comment