-->

ఆర్టీసీ కార్మికులు తొందరపడొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ కార్మికులు తొందరపడొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్


హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కార్మికులు సమ్మె నిర్ణయంపై తొందరపడకుండా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టీఎస్ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి, ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్టీసీ విలీనం, యూనియన్‌కు సంబంధించిన అంశాలపై కమిటీ పని చేస్తున్నదని, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మిగతా సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ కార్మికులు ఈరోజు సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్‌తో చర్చలు జరపాలని నిర్ణయించారు. లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకు భారీగా కార్మికులు చేరుకోవాలని జేఏసీ పిలుపునిచ్చింది.

ఈ చర్చల అనంతరం సమ్మె తేదీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు యోచిస్తున్నట్లు సమాచారం. మార్చి 13న యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793