-->

జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై దాడి – ఎనిమిది మంది అరెస్ట్


జబర్దస్త్ ఫేమ్ కొమురక్కపై దాడి – ఎనిమిది మంది అరెస్ట్

మహబూబ్‌నగర్ జిల్లా, బాలానగర్ మండలం: జబర్దస్త్ కార్యక్రమంతో గుర్తింపు పొందిన కొమురక్కపై ఎనిమిది మంది దాడి చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో సంచలనం సృష్టించింది. అభిమానులమని నమ్మించి ఇంటికి చేరుకున్న నిందితులు ఆమెపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామ పరిధిలోని కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్ కొమురక్కకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గతంలో కొమురక్క ఇంట్లో బంగారం చోరీకి గురైన ఘటనలో శ్రీనాథ్‌పై అనుమానం వ్యక్తం చేయగా, అతను నేరాన్ని అంగీకరించి తిరిగి ఇస్తానని చెప్పాడు. అయితే మాట తప్పడంతో రెండు రోజుల క్రితం కొమురక్క అతనిని మందలించినట్లు సమాచారం.

ఈ విషయం పై ఆగ్రహంతో శ్రీనాథ్ తన గ్రామంలోని స్నేహితులకు చెప్పడంతో, మంగళవారం రాత్రి వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామచరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్ కలిసి రాత్రి 11 గంటల సమయంలో కొమురక్క ఇంటికి చేరుకున్నారు. తాము అభిమానులమని చెప్పి ఫోటోలు దిగడానికి వచ్చామని నమ్మించారు.

అంతలో రామచరణ్ కొమురక్కతో వాగ్వాదానికి దిగుతూ శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావని ప్రశ్నించాడు. వాగ్వాదం క్రమంగా ఉద్రిక్తంగా మారగా, వంశీకృష్ణ రాయితో కొమురక్కపై దాడి చేశాడు. ఆమెను రక్షించేందుకు వచ్చిన సోదరుడు యాదయ్యపై వికాస్ రాయితో దాడి చేశాడు. చంద్రశేఖర్ కర్రతో కొమురక్క కుడి చేతికి గాయపరిచాడు. గ్రామానికి చెందిన రాము అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపైనా రాళ్లతో దాడి చేశారు.

దాడి అనంతరం “చంపేస్తాం” అంటూ బెదిరించిన నిందితులు, స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయడంతో తమ ద్విచక్ర వాహనం వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, బుధవారం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793