అమరవీరుల స్తూపానికి అవమానం.. పోస్టర్లతో అపవిత్రం చేసిన ఘటన కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో అమరవీరుల స్తూపానికి అవమానం జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పట్టణ నడిబొడ్డున ఉన్న బస్టాండ్ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు “హిందూ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు అతికించడం వివాదాస్పదమైంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన ఈ స్తూపాన్ని ప్రజలు పవిత్ర స్థలంగా భావిస్తారు. అలాంటి ప్రదేశంలో రాజకీయ, సామాజిక లేదా మతపరమైన పోస్టర్లు అతికించడం పట్ల స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మథ్యూస్ మాట్లాడుతూ, ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అమరవీరుల స్మారక చిహ్నాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక నాయకులు, ప్రజలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోస్టర్లు అతికించిన వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పట్టణంలో శాంతిభద్రతలు భంగం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.

Post a Comment