రేపటి సమ్మె కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ
హైదరాబాద్, ఏప్రిల్ 22: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం కానుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ రేపటి సమ్మె కార్యాచరణను అధికారికంగా ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట రేపు ఉదయం 5 గంటల నుంచే మహాధర్నాలు నిర్వహించాలని జేఏసీ పిలుపునిచ్చింది. కార్మికులు, సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరింది.
మొదటి రోజు సమ్మెను విజయవంతంగా నిర్వహించిన కార్మికులకు జేఏసీ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, చేతులెత్తేసిందని జేఏసీ ఆరోపించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా జేఏసీ పలు కీలక డిమాండ్లను మరోసారి స్పష్టం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, 2021 వేతన సవరణను కనీసం 30 శాతం తగ్గకుండా అమలు చేయడం, హైదరాబాద్‌లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయడం, ఉద్యోగులను ఇతర జోన్లకు బదిలీ చేసే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడం, కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం వంటి డిమాండ్లు ఉన్నాయి.
సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయబోమని జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

Post a Comment