నీటి బకెట్‌లో పడి రెండేళ్ల చిన్నారి మృతి
నాగర్ కర్నూల్ జిల్లా, లింగాల: ఏప్రిల్ 23: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్న రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ నీటి బకెట్‌లో పడి మృతి చెందింది.
గ్రామానికి చెందిన చింతకుంట మల్లేష్, విజయ దంపతులకు మీనాక్షి (2) అనే కూతురు ఉంది. గురువారం మధ్యాహ్న సమయంలో తల్లి విజయ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లగా, ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు భోజనం చేస్తున్నారు. అదే సమయంలో చిన్నారి మీనాక్షి అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి బాత్రూంకు వెళ్లింది.
అక్కడ ఉన్న నీటి బకెట్‌లో అనుకోకుండా బోర్లా పడిపోవడంతో బయటకు రాలేకపోయింది. కొంతసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, బకెట్‌లో పడి ఉన్నట్లు గమనించారు. వెంటనే బయటకు తీసినా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు గుర్తించారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. తమ కూతురు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
జాగ్రత్తలు అవసరం:
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చిన్నారులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, ముఖ్యంగా ఇంట్లో నీటి బకెట్లు, ట్యాంకులు వంటి వాటిని మూతపెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

Post a Comment