ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి బేటాయింపు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండెంగా గ్రామ శివారు వాగ్య తండాలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి బేటాయించి నిరసనకు దిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
లభించిన వివరాల ప్రకారం, కేసముద్రం మండలం రేకుల తండాకు చెందిన ఓ యువతి, గుండెంగా గ్రామ శివారు వాగ్య తండాకు చెందిన తేజావత్ రఘురాం అనే యువకుడితో గత ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఇప్పుడు మాట తప్పాడని ఆరోపించింది.
ఈ నేపథ్యంలో, “పెళ్లి చేసుకునే వరకు ఇక్కడి నుంచి వెళ్లను… చావనైనా చస్తాను గాని వెనక్కి వెళ్లను” అంటూ ప్రియుడి ఇంటి ముందే కూర్చొని నిరసన చేపట్టింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా, స్థానికులు భారీగా గుమికూడారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం.

Post a Comment