ఘోర ప్రమాదం: ముగ్గురు కార్మికులు మృతి, పది మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్, ఏప్రిల్ 27: Hyderabad శివార్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. Shankarpally మండలంలోని మహాలింగాపురంలో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే… మహాలింగాపురంలో ఉన్న ఎన్‌సీసీ (NCC) సిమెంట్ బ్రిక్స్ తయారీ పరిశ్రమలో కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా వాతావరణం మారింది. చిమ్మచీకట్లు కమ్మేలా మబ్బులు పట్టడంతో పాటు భారీ ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి పరిశ్రమలో ఉన్న భారీ క్రేన్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కార్మికులపై కూలిపోయింది.
ఈ ఘటన సమయంలో అక్కడ మొత్తం 13 మంది కార్మికులు పనిచేస్తుండగా, ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన పది మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించబడుతున్నాయా లేదా అనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంతో మహాలింగాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment