రన్నింగ్ బస్సు నుంచి ఊడిన టైరు.. ద్విచక్ర వాహనానికి ఢీ
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో బుధవారం ఉదయం అప్రత ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి–569పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు నుంచి వెనుక చక్రం ఊడి రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
స్థానికుల వివరాల ప్రకారం, వరంగల్ డిపోకు చెందిన టీజీ 03 టి 1553 నంబర్ గల ఎలక్ట్రానిక్ ఆర్టీసీ బస్సు ఉదయం వరంగల్ నుంచి ఖమ్మం వైపు ప్రయాణికులతో బయలుదేరింది. మరిపెడలోని లక్కీ గ్రాండ్ రెస్టారెంట్ సమీపానికి చేరుకోగానే బస్సు వెనుక చక్రం అకస్మాత్తుగా ఊడిపోయింది. అదుపు తప్పిన ఆ చక్రం పక్కనే వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఘటన అనంతరం ఆ చక్రం దాదాపు 500 మీటర్ల దూరంలో కార్గిల్ సెంటర్ కూడలి వద్ద పడినట్లు సమాచారం. ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, బైక్‌పై ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాకపోవడం ఊరటనిచ్చింది.
ఆ సమయంలో బస్సులో సుమారు 21 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. అయితే ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతోందని డిపో సీఐ తెలిపారు. బస్సు బయలుదేరే ముందు అన్ని తనిఖీలు నిర్వహించామని, మార్గమధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్చని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని పట్టించుకోకుండా బస్సు డ్రైవర్ చక్రం కోసం పరుగులు తీయడం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. డ్రైవర్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment