మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేటలో దొంగ నోట్ల కేసు – కీలక నిందితుల అరెస్ట్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఇటీవల సంచలనం సృష్టించిన దొంగ నోట్ల చలామణి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించి పరారీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు మంచిర్యాల ఏసీపీ రత్నాపురం ప్రకాష్ వెల్లడించారు.
ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం, లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో నకిలీ రూ.500 నోట్లను చలామణి చేస్తూ వ్యాపారులను మోసం చేస్తున్న ముఠాపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ముందుగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా, మరికొంత మంది పరారీలో ఉన్నారు.
ఈ క్రమంలో గోదావరిఖనికి చెందిన కోదండరావ్, కాకినాడకు చెందిన రవి, పశ్చిమ గోదావరి జిల్లా చింతపల్లికి చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు దొంగ నోట్ల సరఫరా మరియు చలామణిలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా నిందితులు పెట్రోల్ బంకులు, దుకాణాలు వంటి వ్యాపార కేంద్రాల్లో నకిలీ నోట్లను వినియోగించి సరుకులు కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే లక్షల్లో నకిలీ కరెన్సీ, వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన మేరకు, ఈ ముఠా అంతర్రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ వివిధ ప్రాంతాల నుంచి నకిలీ నోట్లను సేకరించి స్థానికంగా చలామణి చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇంకా పరారీలో ఉన్న ఇతర నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ సందర్భంగా ప్రజలు నగదు లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద నోట్లు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment