శంకర్ గౌడ్ మృతదేహం తరలింపుపై ఉద్రిక్తత.. ముత్తోజిపేటలో హైటెన్షన్
వరంగల్, ఏప్రిల్ 24: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం తరలింపుపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మృతి చెందిన శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపోకు తీసుకెళ్లి నివాళులు అర్పించాలని కార్మికులు, కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే దీనికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
డిపోకు మృతదేహాన్ని తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఉన్న కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తోపులాటలు జరిగి ఉద్రిక్తత మరింత పెరిగింది. కొందరు ఆగ్రహంతో పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం.
ఇక బీఆర్ఎస్ నాయకులు, ఆర్టీసీ కార్మికులు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు ఉధృతం కావడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
శంకర్ గౌడ్ మృతితో ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ సహోద్యోగి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ముత్తోజిపేట గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Post a Comment