-->

పాఠశాలల్లో రాజ్యాంగంపై ప్రత్యేక సబ్జెక్ట్ ఏర్పాటు చేయాలి: జెబి శౌరి డిమాండ్

పాఠశాలల్లో రాజ్యాంగంపై ప్రత్యేక సబ్జెక్ట్ ఏర్పాటు చేయాలి: జెబి శౌరి డిమాండ్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడానికి పాఠశాల స్థాయి నుంచే రాజ్యాంగంపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు జెబి శౌరి అన్నారు. ఈ మేరకు ఆయన పాఠశాలల్లో “రాజ్యాంగం”పై ప్రత్యేక సబ్జెక్ట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రస్తుత సమాజంలో యువతలో రాజ్యాంగ హక్కులు, బాధ్యతలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రాలు, ప్రాథమిక హక్కులు, కర్తవ్యాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి అవగాహన కలిగితే వారు బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని తెలిపారు.

పాఠశాల సిలబస్‌లో భాగంగా రాజ్యాంగ పాఠ్యాంశాలను చేర్చడం ద్వారా దేశభక్తి, నైతిక విలువలు, సామాజిక బాధ్యత వంటి అంశాలు విద్యార్థుల్లో పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకునే రాజ్యాంగ దినోత్సవాన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని సూచించారు.

ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని జెబి శౌరి విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793