రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న ఘటన – QR కోడ్‌తో బిక్షమెత్తుతున్న వ్యక్తి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ఆసక్తికరమైన, సమాజంలో మారుతున్న ధోరణిని ప్రతిబింబించే ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా బిక్షగాళ్లు చిల్లర కోసం చేతులు చాచడం మనం చూస్తుంటాం. కానీ సాంకేతికతను అనుసరిస్తూ ఓ బిక్షగాడు కొత్త మార్గాన్ని ఎంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో ఓ బిక్షగాడు చేతిలో QR కోడ్ పట్టుకుని వీధి వీధి తిరుగుతూ బిక్షమెత్తుతున్నాడు. “డబ్బులు ఇవ్వండి... లేదంటే నా QR కోడ్‌ను స్కాన్ చేసి పంపండి” అంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నాడు. చిల్లర కోసం ఇబ్బందులు పడకుండా, డిజిటల్ పేమెంట్స్‌ను వినియోగించుకోవడం ద్వారా తన అవసరాలను తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ బిక్షగాడు కూడా కాలానికి తగ్గట్టుగా మారడం విశేషం. ఈ ఘటనను చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, “ఇది టెక్నాలజీ ప్రభావం ఎంత లోతుగా చేరిందో చూపిస్తోంది” అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వినూత్న ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Post a Comment