మహిళలపై మండే ఎండల తీవ్ర ప్రభావం.. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. భగ్గుమంటున్న ఎండలు, వడగాలుల కారణంగా మహిళలు శారీరకంగానే కాకుండా మానసికంగానూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూలీ పనులు, వ్యవసాయ పనులు, షాపింగ్ మాల్స్, చిన్న పరిశ్రమల్లో పనిచేసే మహిళలు ఈ ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు.
2024లో భారత వాతావరణ శాఖ విడుదల చేసిన అధ్యయనం ప్రకారం, వడగాలుల ప్రభావంతో మహిళల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వేడి కారణంగా సంభవించే మరణాల్లో కూడా మహిళల సంఖ్య అధికమవుతోందని నివేదిక వెల్లడించింది.
పని ప్రదేశాల్లో మహిళల ఇబ్బందులు
షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు వంటి ప్రదేశాల్లో పనిచేసే మహిళలకు తాగునీరు, విశ్రాంతి వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బయట మండుతున్న ఎండల కారణంగా తీసుకెళ్లిన నీళ్లు కూడా వేడెక్కిపోతుండటంతో చాలామంది మహిళలు గంటల తరబడి నీళ్లు తాగకుండా పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, వదులైన దుస్తులు ధరించే అవకాశం లేకపోవడం వల్ల వేడి మరింత ఇబ్బందిగా మారుతోంది.
ఇంట్లో ఉన్నా వడదెబ్బ ప్రమాదమే
చిన్న ఇళ్లలో, రేకుల షెడ్లలో నివసించే మహిళలు కూడా తీవ్రమైన వేడి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ఒకేలా వేడి అనిపిస్తోందని పలువురు మహిళలు వాపోతున్నారు. సాయంత్రం అయ్యేసరికి నీరసం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి.
పొలం పనుల్లో మహిళల కష్టాలు
వ్యవసాయ పనులు చేసే మహిళలు ఉదయం తెల్లవారుజామునే పనులకు వెళ్లాల్సి వస్తోంది. ఉదయం 11 గంటల వరకు పని చేసి, తిరిగి సాయంత్రం నుంచి రాత్రి వరకు పొలాల్లోనే శ్రమిస్తున్నారు. ఇంటి పనులు, పొలం పనులు రెండింటినీ భుజాన వేసుకున్న మహిళలు తీవ్ర అలసట, శారీరక నొప్పులు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
మహిళల్లో మరణాల రేటు పెరుగుదల
1980-2000 మధ్య భారతదేశంలో తేమతో కూడిన ఉష్ణోగ్రత తీవ్రత 30 శాతం పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. పెరుగుతున్న వేడి ప్రభావం పురుషుల కంటే మహిళలపై ఎక్కువగా పడుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
2000-2010 మధ్య పురుషుల్లో ఉష్ణోగ్రతల కారణంగా మరణాల రేటు 23.11 శాతం తగ్గగా, మహిళల్లో 4.63 శాతం పెరిగింది. అలాగే 2010-2019 మధ్య పురుషుల్లో ఈ రేటు 18.7 శాతం తగ్గినా, మహిళల్లో మాత్రం 9.84 శాతం పెరిగినట్లు వెల్లడైంది.
గర్భిణీలకు అధిక ప్రమాదం
తీవ్రమైన వేడి గర్భిణీల ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతోంది. ముందస్తు ప్రసవాలు, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, మృత శిశు జననాలు, తల్లి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్, అలసట, గుండె, మూత్రపిండాల సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి.
వాతావరణ విధానాల్లో మహిళలకు ప్రాధాన్యం అవసరం
వాతావరణ మార్పులపై చర్చల్లో మహిళల సమస్యలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేదరికం, గృహవసతి, ఆరోగ్య సేవలు, పని పరిస్థితులు వంటి అంశాలతో మహిళల ఆరోగ్యం ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రకారం, ప్రపంచ సగటుతో పోలిస్తే దక్షిణాసియా వేగంగా వేడెక్కుతోంది. రోజువారీ కూలిపై ఆధారపడే కుటుంబాల్లో మహిళలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం
ఎక్కువకాలం వేడికి గురికావడం వల్ల మహిళల్లో ఆందోళన, నిద్రలేమి, భావోద్వేగ ఒత్తిడి పెరుగుతోందని పలు అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా కుటుంబ హింస, సన్నిహిత భాగస్వాముల నుంచి హింస కూడా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణ మార్పు గురించి చర్చించే సమయంలో కేవలం ఉష్ణోగ్రతలనే కాకుండా, ఆ వేడిని మోస్తున్న మహిళల జీవితాలను కూడా గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment