తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బలపరీక్షలో విజయం
- టీవీకే ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు
- వ్యతిరేకంగా 22 మంది ఓట్లు
- కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్‌తో పాటు అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేల మద్దతు
తమిళనాడు;May 13: తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. బుధవారం నిర్వహించిన బలపరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, వ్యతిరేకంగా 22 మంది సభ్యులు ఓటు వేశారు. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ మూజువాణి ఓటుకు బదులుగా ఒక్కో సభ్యుడి అభిప్రాయాన్ని నమోదు చేస్తూ ఓటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అన్నాడీఎంకేకు చెందిన పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు కూడా సీఎం విజయ్‌కు అనుకూలంగా నిలిచారు.
ఇక ప్రతిపక్ష డీఎంకే ఈ విశ్వాస పరీక్షను బహిష్కరించింది. పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడంతో సభలో సభ్యుల సంఖ్య తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కూడా తగ్గి, సీఎం విజయ్‌కు బలపరీక్ష సులభమైంది.
బలపరీక్ష అనంతరం సీఎం విజయ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసంతోనే ఎన్నికల్లో గెలిచామని, తమపై ప్రతి వర్గానికీ నమ్మకం ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
టీవీకేకు మద్దతు తెలిపిన అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ నేత వేలుమణి మాట్లాడుతూ తాము ఎలాంటి మంత్రి పదవులు ఆశించడం లేదని చెప్పారు. దీనికి స్పందించిన సీఎం విజయ్, ప్రలోభాలు చూపించి మద్దతు కూడగట్టాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.
మరోవైపు డీఎంకే నేత ఉదయనిధి విజయ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల్లో మెజారిటీ విజయ్‌ను తిరస్కరించారని ఆరోపించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా అన్నాడీఎంకే మద్దతును కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయని అన్నారు. అలాగే డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Post a Comment