అప్పుల వేధింపులతో వ్యవసాయ శాఖ ఉద్యోగి ఆత్మహత్య
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధలు, వడ్డీ వ్యాపారులు మరియు చిట్‌ఫండ్ ఏజెంట్ల వేధింపులు భరించలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటోజు బాలరాజు (38) కేతేపల్లి మండలంలో వ్యవసాయ శాఖలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నాడు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నాడు. అయితే వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ లెక్కలు చూపుతూ, చెక్కులు మరియు ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని డబ్బుల కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
ఈ వేధింపులను తట్టుకోలేక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని బాలరాజు ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడికి భార్య పద్మ, ఒక కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

Post a Comment