-->

గంజాయి హాట్‌స్పాట్లపై ప్రత్యేక నిఘా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

 

గంజాయి హాట్‌స్పాట్లపై ప్రత్యేక నిఘా మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై కఠిన చర్యలు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

సమగ్ర దర్యాప్తుతో నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిని హాట్‌స్పాట్లుగా పరిగణించి నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాలో పాల్గొనే వ్యక్తులు, ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించి వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

మత్తు పదార్థాలను రవాణా చేసిన వారితో పాటు వాటిని విక్రయించే వ్యక్తులు, సేవించే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలో నమోదవుతున్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరానికి సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి, శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు నిర్వహించడం ద్వారా నిందితులకు కోర్టులలో శిక్షలు పడేలా పటిష్టమైన చార్జిషీట్లు దాఖలు చేయాలని పేర్కొన్నారు.

పోలీసు అధికారులు తమ పరిధిలోని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఆయన గుర్తుచేశారు.

సమావేశంలో జిల్లాలో గత నెలలో నమోదైన వివిధ రకాల నేరాలు, వాటి దర్యాప్తు పురోగతి, కేసుల పరిష్కార శాతం, నిందితుల అరెస్టులు, శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, నేరాల నివారణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ పోలీసు అధికారులకు సూచించారు.

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793