వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి.. భారీ ఆస్తి, పంట నష్టం
ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురవడంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు ముఖ్యంగా కృష్ణా, ఎన్‌టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపాయి. ఈ వర్ష బీభత్సంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
కృష్ణా జిల్లా కుమ్మరపాలెంలో బైక్‌పై వెళ్తున్న మనోహర్, శివరామకృష్ణ అనే ఇద్దరు యువకులపై భారీ చెట్టు కూలిపడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. విజయవాడలో ఈదురు గాలుల కారణంగా విద్యుత్ లైన్ తెగిపడటంతో ఓ హోం గార్డు ప్రాణాలు కోల్పోయారు. అలాగే కృష్ణా జిల్లా లంకపల్లిలో తాగునీరు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లిన అనిత అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని తెగిపడి ఉన్న విద్యుత్ తీగను గమనించక దానిపై కాలుమోపడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఘటనలో ఒకరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
తీవ్రమైన గాలుల కారణంగా వందలాది చెట్లు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమవడంతో కృష్ణా, ఎన్‌టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు గంటల తరబడి విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడ్డాయి. విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది.
విద్యుత్ శాఖ అధికారులు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. మరోవైపు రాయలసీమలోని అనంతపురం జిల్లాలో వర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో బొప్పాయి, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రైతులకు సుమారు రూ.5 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వర్ష ముప్పు ఇంకా కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, విద్యుత్ తీగలు, చెట్ల సమీపంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Post a Comment