తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య.. కొడుకును చూసి తల్లి కూడా బలవన్మరణం
Telanganaలోని Rangareddy district జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బంధాలు, అనుబంధాల విలువ తగ్గిపోతున్న ఈ రోజుల్లో తండ్రిపై కుమారుడు పెంచుకున్న మమకారం చివరకు విషాదాంతానికి దారితీసింది. కుమారుడి మృతిని చూసి తల్లి కూడా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన పసుల కళాధర్, కళావతి దంపతులు తమ కుమారుడు శివకుమార్‌తో కలిసి మేడ్చల్‌లో నివసించేవారు. భార్యాభర్తలిద్దరూ టైలరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న కళాధర్ ఆరు నెలల క్రితం మృతి చెందాడు.
భర్త మృతితో కళావతి తన కుమారుడు శివకుమార్(20)ను తీసుకుని రంగారెడ్డి జిల్లా లష్కర్‌గూడ పంచాయతీ కనకదుర్గానగర్ కాలనీలో నివసిస్తున్న తన సోదరుడి వద్దకు వచ్చారు. అక్కడే అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
తండ్రి మరణాన్ని శివకుమార్ తీవ్రంగా మనసులో పెట్టుకున్నాడు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తరచూ మానసిక వేదనకు గురయ్యేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత కుమారుడు మృతదేహంగా కనిపించడంతో తల్లి కళావతి(45) తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఇప్పటికే భర్తను కోల్పోయిన ఆమె.. ఇప్పుడు కుమారుడి మరణాన్ని తట్టుకోలేకపోయారు. జీవితం మీద విరక్తితో ఆమె కూడా చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment