వర్షం నుంచి తప్పించుకోవాలని చెట్టు కిందకు వెళ్లారు.. పిడుగుపాటుకు దంపతుల మృతి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రెబ్బెన మండలం కైరుగూడ గ్రామంలో పిడుగుపాటుకు గురై భార్యాభర్తలు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం ప్రకారం, టెకం భీము (50), ఆయన భార్య రాజబాయి సహా ముగ్గురు కూలీలు పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం ప్రారంభమైంది. వర్షం నుంచి రక్షణ కోసం సమీపంలోని ఓ చెట్టు కిందకు వెళ్లారు.
అయితే దురదృష్టవశాత్తూ వారు నిలబడ్డ చెట్టుపైనే పిడుగు పడటంతో టెకం భీము, రాజబాయి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు ఉన్న ఆత్రం గంగు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కళ్లముందే దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వర్షం, ఉరుములు, మెరుపులు సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందకూడదని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Post a Comment