ప్రజలకు బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు.. గ్రామాల్లో స్వైరవిహారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండలం: మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, చిన్నారులు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆళ్లపల్లి, అనంతోగు, పాతూర్, రఘవపురం, మర్కోడు తదితర గ్రామాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చికెన్ దుకాణాలు, పాఠశాలల పరిసరాలు, నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వారిపై గుంపులుగా దాడి చేయడం, ద్విచక్ర వాహనాలను వెంబడించడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొన్నారు. గతంలో చిన్నారులు, వృద్ధులపై దాడి చేసిన సంఘటనలు కూడా నమోదైనట్లు తెలిపారు.
వీధి కుక్కల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు హామీ కల్పించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Post a Comment