-->

మాజీ సర్పంచ్ భర్త మధు హత్య కేసు ఛేదన.. ఐదుగురు అరెస్ట్

మాజీ సర్పంచ్ భర్త మధు హత్య కేసు ఛేదన.. ఐదుగురు అరెస్ట్

సూర్యాపేట: జిల్లాలో సంచలనం సృష్టించిన యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో మహిళా నిందితురాలు పరారీలో ఉన్నట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు.

జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, ఒక బైక్, హత్యకు ఉపయోగించిన కత్తి, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అరెస్ట్ చేసిన నిందితులు:

  • మిద్దె జీవన్ (27) – యర్కారం గ్రామం
  • చింత సైదులు (45) – రామన్నగూడెం
  • మేదరి ప్రసాద్ (34) – యర్కారం
  • మిద్దె ఆనంద్ (24) – యర్కారం
  • కక్కిరేణి భరత్ చంద్ భరత్ (21) – తాళ్లగడ్డ

మరో మహిళా నిందితురాలు ముల్కలపల్లి భవాని పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మిస్సింగ్ కేసు నుంచి హత్య కేసుగా..

యర్కారం గ్రామానికి చెందిన 42 ఏళ్ల చింతలపాటి మధు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అతని భార్య మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

అయితే శనివారం ఉదయం గ్రామ శివారులోని కల్వర్టు కింద గోనె సంచిలో మధు మృతదేహం లభించడంతో కేసును హత్య కేసుగా మార్చి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు.

ప్రతీకారంతో హత్య

2007లో యర్కారం మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, ఆ కక్షతో రవీందర్ కుమారుడు మిద్దె జీవన్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

జీవన్ తన స్నేహితులు చింత సైదులు, మేదరి ప్రసాద్ సహకారంతో మధును హత్య చేసేందుకు పథకం రచించినట్లు తెలిపారు. గతంలో రెండు సార్లు ప్రయత్నించినా విఫలమయ్యారని చెప్పారు.

మందు పార్టీ పేరుతో పిలిచి హత్య

శుక్రవారం చేపలు, మద్యం పార్టీ పేరుతో మధును తాళ్లగడ్డలోని అద్దె ఇంటికి పిలిచారు. మధు మద్యం మత్తులో ఉన్న సమయంలో జీవన్, ఆనంద్ అక్కడికి చేరుకున్నారు.

ప్రసాద్ మధు చేతులు, కాళ్లు పట్టుకోగా సైదులు దాడి చేశాడని, అనంతరం జీవన్ మటన్ కత్తితో మెడ, ముఖం, భుజాలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో యర్కారం శివారులోని కల్వర్టు కింద పడేసినట్లు చెప్పారు. మధు బైక్‌ను మరో ప్రాంతంలో వదిలేసి, హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్‌ఫోన్‌ను అడివేముల శివారులో పారేసి నిందితులు పరారయ్యారని వెల్లడించారు.

టెక్నికల్ ఆధారాలతో కేసు ఛేదన

సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు టెక్నికల్ ఆధారాలు, క్లూస్ టీమ్ సహకారంతో దర్యాప్తు చేపట్టాయి. టేకుమట్ల వద్ద జాతీయ రహదారిపై మిద్దె జీవన్, మిద్దె ఆనంద్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం కుట్ర వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హత్యలు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. హంతకులకు త్వరితగతిన శిక్షలు పడేలా బలమైన సాక్ష్యాలతో కోర్టులో కేసు ప్రవేశపెడతామని తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793