రాజ్యసభకు షర్మిల.. కర్ణాటక కోటాలో అవకాశం?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కర్ణాటక రాష్ట్ర కోటాలో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి ఆమె పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం.
తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి 2024 జనవరిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే షర్మిలకు ఏపీసీసీ అధ్యక్ష పదవితో పాటు భవిష్యత్తులో రాజ్యసభ సీటు కల్పిస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆహ్వానం మేరకు ఆమె శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు.
ఢిల్లీలో తొలుత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల్లో పార్టీ బలాన్ని పెంచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో కూడా షర్మిల భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రాజ్యసభ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, షర్మిలకు రాజ్యసభ సీటు దాదాపు ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Post a Comment