ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 10 మందికి తీవ్ర గాయాలు
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 10 మందికి తీవ్ర గాయాలు
బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం ప్రకారం.. ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ప్రయాణం మధ్యలో చింతామణి సమీపానికి చేరుకున్న సమయంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ఘటనలో గాయపడిన వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులేనని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు ప్రధాన కారణంగా ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment