-->

రోడ్డు భద్రతపై కీలక నిర్ణయం119 గ్రామపంచాయతీలు, 9 వార్డుల్లో “నో హెల్మెట్ – నో ఎంట్రీ” తీర్మానాలు

 

రోడ్డు భద్రతపై కీలక నిర్ణయం119 గ్రామపంచాయతీలు, 9 వార్డుల్లో “నో హెల్మెట్ – నో ఎంట్రీ” తీర్మానాలు

 రోడ్డు భద్రతపై కీలక నిర్ణయం119 గ్రామపంచాయతీలు, 9 వార్డుల్లో “నో హెల్మెట్ – నో ఎంట్రీ” తీర్మానాలు

మహబూబాబాద్, జూన్ 10: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజే 119 గ్రామపంచాయతీలు, 9 వార్డుల్లో “నో హెల్మెట్ – నో ఎంట్రీ” తీర్మానాలు ఆమోదించడం విశేషంగా నిలిచింది. “సురక్షిత – గంజాయి రహిత ఆదర్శ గ్రామం” లక్ష్యంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ పిలుపునిచ్చారు.

గూడూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో “అరైవ్ అలైవ్ (Arrive Alive)” కార్యక్రమం కింద రహదారి భద్రత, గంజాయి నిర్మూలనపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ డా. శబరీష్ పి. గ్రామస్తులకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యత, గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేసిన ఎస్పీ, రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మరణాలకు హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు.

గ్రామపంచాయతీలు అమలు చేస్తున్న “నో హెల్మెట్ – నో ఎంట్రీ” నిర్ణయాన్ని అభినందించిన ఎస్పీ, ఈ తీర్మానాన్ని ఆమోదించిన సర్పంచులు, ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా ప్రశంసించారు. “మన ఊరు – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ రోజు జరిగిన గ్రామసభల్లో సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు కలిసి రహదారి భద్రత, గంజాయి నిర్మూలన, గ్రామ భద్రతకు సంబంధించిన ప్రత్యేక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ నిబంధనల అమలు, గంజాయి ప్రవేశాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

గంజాయి నిర్మూలన కోసం జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఎస్పీ, గంజాయి విక్రయాలు లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం 8712656999 నంబర్‌కు అందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.

అదేవిధంగా మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సీట్‌బెల్ట్ ధరించకుండా ప్రయాణించడం, వాహన నంబర్ ప్లేట్లలో మార్పులు చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ట్రాక్టర్ల వెనుక భాగంలో ఎరుపు రంగు రిఫ్లెక్టర్ స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని, వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలను సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, గూడూరు సీఐ విజయ్, ఎస్ఐ గిరిధర్, ఎంఆర్ఓ నాగభవాని, సర్పంచ్ సునీత, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793