భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూన్ 20న జాతీయ లోక్ అదాలత్
పెండింగ్ కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత
కొత్తగూడెం, జూన్ 6: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు ఈ నెల జూన్ 20వ తేదీన (శనివారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కక్షిదారులు తమ పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల్లో నడుస్తున్న వివాదాలను పరస్పర అంగీకారంతో ఒకే రోజు పరిష్కరించుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు (ఎన్‌ఐ యాక్ట్), బ్యాంకు రికవరీ కేసులు, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు (ఎంవీఓపీ), వివాహ బంధానికి సంబంధించిన వివాదాలు, ఆస్తి పంపకాల కేసులు, అద్దె వివాదాలు, ఇతర సివిల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ-చలాన్ కేసులు, సైబర్ క్రైమ్ కేసులు, చిన్నపాటి దొంగతనాల కేసులు, టెలిఫోన్ బకాయిల కేసులు, మనోవర్తి కేసులు, కొట్టుకున్న కేసులు, బ్యాంకు సంబంధిత వివాదాలు తదితర అనేక రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని వివరించారు.
లోక్ అదాలత్‌లో ఇరుపక్షాల అంగీకారంతోనే నిర్ణయం తీసుకోబడుతుందని, ఇందులో గెలుపోటముల ప్రశ్న ఉండదని అధికారులు తెలిపారు. అలాగే లోక్ అదాలత్‌లో వచ్చిన తీర్పు తుది నిర్ణయంగా పరిగణించబడుతుందని, దానిపై మళ్లీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
కోర్టుల చుట్టూ సంవత్సరాల పాటు తిరగాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే కేసులకు ముగింపు లభిస్తుందని పేర్కొన్నారు. దీంతో సమయం, ధనం, శ్రమ ఆదా అవుతాయని తెలిపారు.
జిల్లాలోని కక్షిదారులు, ప్రతివాదులు తమ న్యాయవాదుల ద్వారా లేదా నేరుగా సంబంధిత కోర్టులను సంప్రదించి తమ కేసులను లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని, ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత కోరారు.

Post a Comment