ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు క్షేమం, పలువురికి గాయాలు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 36 మంది ప్రయాణికులు క్షేమం, పలువురికి గాయాలు
ఖమ్మం, జూన్ 8: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం.
వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపైకి చేరుకున్న సమయంలో అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సు రోడ్డుపై బోల్తా పడింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ధర్మాజిగూడెం, అక్కిరెడ్డిగూడెం, లింగపాలెం, రాఘవాపురం, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు అతివేగంగా ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో కొత్తలంకపల్లి ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రయాణికులంతా ప్రాణాపాయం నుంచి బయటపడటం కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.

Post a Comment