సైబర్ మోసాల బాధితులకు భారీ ఊరట.. 6,303 మందికి రూ.45.21 కోట్లు రీఫండ్
సైబర్ మోసాల బాధితులకు భారీ ఊరట.. 6,303 మందికి రూ.45.21 కోట్లు రీఫండ్
హైదరాబాద్, జూన్ 29: తెలంగాణలో సైబర్ మోసాలకు గురైన బాధితులకు ప్రత్యేకంగా నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా భారీ ఊరట లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 6,303 మంది సైబర్ మోసం బాధితులకు మొత్తం రూ.45.21 కోట్లను తిరిగి అందించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ రికవరీ ప్రక్రియలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 2,232 మంది బాధితులకు చెందిన రూ.21.91 కోట్లను రికవరీ చేసి తిరిగి అందించింది.
అదేవిధంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తన పరిధిలోని 77 మంది బాధితులకు సంబంధించిన రూ.6.83 కోట్లను నేరుగా రికవరీ చేసి బాధితులకు అందజేసింది.
పోలీసుల వివరాల ప్రకారం, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 59,953 మంది సైబర్ మోసం బాధితులకు మొత్తం రూ.445.41 కోట్లను తిరిగి ఇప్పించగలిగారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల నుంచి మోసపోయిన సొమ్మును రికవరీ చేయడంలో రాష్ట్రంలో ముందంజలో నిలిచాయి.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని, అలాగే అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

Post a Comment