-->

నిత్య పెళ్లికూతురి మోసం బట్టబయలు.. ఐదుగురిని పెళ్లి చేసుకుని లక్షలు కాజేసిన మహిళ అరెస్ట్

 

నిత్య పెళ్లికూతురి మోసం బట్టబయలు.. ఐదుగురిని పెళ్లి చేసుకుని లక్షలు కాజేసిన మహిళ అరెస్ట్

నిత్య పెళ్లికూతురి మోసం బట్టబయలు.. ఐదుగురిని పెళ్లి చేసుకుని లక్షలు కాజేసిన మహిళ అరెస్ట్

అనంతపురం, జూన్ 27: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి పేరుతో పలువురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన మహిళను అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహాల పేరుతో వరుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని పరారవుతున్న నిత్య పెళ్లికూతురి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. 2025లో పెద్దవడుగూరు మండలం కాశేపల్లికి చెందిన సుధీర్‌రెడ్డితో మధ్యవర్తులు సుమప్రియ, అశోక్, రామకృష్ణ, శశికళ ద్వారా మణికి పరిచయం ఏర్పడింది. వివాహం కోసం సుధీర్‌రెడ్డి రూ.3.8 లక్షలు ఎదురుకట్నంగా ఇచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ సంబంధం కుదిర్చిన మధ్యవర్తులు మణికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం.

వివాహం అనంతరం మూడు రోజుల పాటు భర్త ఇంట్లో ఉన్న మణి, తన ఆరోగ్యం బాగోలేదని చెప్పి పుట్టింటికి వెళ్తానని కోరింది. దీంతో సుధీర్‌రెడ్డి ఆమెను రైలులో తీసుకెళ్తుండగా, నంద్యాల రైల్వే స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో కిందికి దిగి పరారైంది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. అనంతరం మధ్యవర్తులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో తాను మోసపోయినట్లు సుధీర్‌రెడ్డి గుర్తించాడు.

దర్యాప్తులో మణి ఇప్పటికే ఐదుగురిని వివాహం చేసుకుని మోసం చేసినట్లు, ఆమెకు కుమారుడు, కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 2025లో కేసు నమోదు చేసి ఆమె కోసం గాలింపు చేపట్టారు.

తాజాగా ఆమె కర్ణాటకకు వెళ్లి అక్కడ మల్లెకుప్ప ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మల్లెకుప్ప నుంచి మదనపల్లెకు వస్తోందన్న సమాచారంతో పెద్దవడుగూరు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో వివాహ సంబంధాలు కుదిర్చిన మధ్యవర్తులైన సుమప్రియ, అశోక్, రామకృష్ణ, శశికళలపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.

ఈ ఘటనతో వివాహాల పేరుతో జరుగుతున్న మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత వ్యక్తుల వివరాలను పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే వివాహాలు నిర్ణయించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793