భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగిన భార్య.. అదనపు కట్నం, వివాహేతర సంబంధం ఆరోపణలు
భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగిన భార్య.. అదనపు కట్నం, వివాహేతర సంబంధం ఆరోపణలు
హనుమకొండ జిల్లాలో ఓ మహిళ తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగిన ఘటన కలకలం రేపింది. కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధితురాలు శ్రీజ తెలిపిన వివరాల ప్రకారం.. ఐనవోలు మండలం వెంకటాపూర్‌కు చెందిన ఆమెకు గుండేడుకు చెందిన డెంగు రాజుతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.12 లక్షల నగదు, 16 తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చినట్లు తెలిపింది. అయితే పెళ్లైన మూడు నెలలకే భర్త, అత్త అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారని ఆరోపించింది.
ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని ఆమె పేర్కొంది. అనంతరం హైదరాబాద్‌కు తీసుకెళ్లిన భర్త మద్యం సేవించి వచ్చి తరచూ దాడి చేసేవాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లి వచ్చేవాడని ఆరోపించింది.
అలాగే ఆన్‌లైన్ పేకాటలో లక్షల రూపాయలు నష్టపోయి, ఆ డబ్బుల కోసం అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడని, పుస్తెల తాడుతో ఉరి బిగించి బెదిరించేవాడని కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం భర్త తన మేనమరదలితో ఉంటూ, "నువ్వేం చేసుకుంటావో చేసుకో" అంటూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడని తెలిపింది.
గత 20 నెలలుగా తాను పుట్టింట్లోనే ఉంటున్నానని, పోలీసుల వద్దకు పిలిచినా తనకు ఎలాంటి న్యాయం చేయనని భర్త చెప్పాడని ఆరోపించింది. వివాహ సమయంలో ఇచ్చిన కట్నం, బంగారు ఆభరణాలు తిరిగి ఇప్పించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టినట్లు వెల్లడించింది.
ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, అధికారుల జోక్యంతో బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
గమనిక: ఇవి బాధితురాలు చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై భర్త లేదా సంబంధిత అధికారుల స్పందన వెల్లడికాలేదు.

Post a Comment